Sunday, December 6, 2009

Death! Who are you?

మరణమా! ఎవరివోయి అసలు నీవు?
ఎవరిచ్చే ఆజ్ఞతోటి , ఎచటనుండి నీ రాక?
ఎవరినెప్పుడు ఎక్కడికి తీసుకెళ్లె నీ పోక?

కుళ్లు, కుట్రలతోటి అంతా కమిలిపోయిందిక్కడ
కారుకమ్మిన చీకట్లే మిగిలిపోయాయింకిక్కడ
కానీ ధైర్యంగా ఎదురీదుతూ బ్రతికేస్తున్నానిక్కడ
అందుకే, నాకు నేను ధైర్యశాలిననిపిస్తుంది
కానీ, నువ్వంటే నాకు భయమేమోననిపిస్తుంది.

ఎప్పుడో ఒకప్పుడు వస్తావని తెలుసెప్పుడు
నిన్ను దైవం పంపిస్తాడని అనిపించేటప్పుడు
ఏదో ఆశ తళుక్కుమని కనిపిస్తుందప్పుడు
ఇంతకంటే ప్రశాంతత ఎక్కడో ఉందనిపించినప్పుడు
నువ్వు నన్ను రమ్మన్నప్పుడు
గుర్తుంచుకో నీ గుండెల్లో -
కొద్దిపాటి కరుణంటూ నీకైనా అసలుంటే:

నువ్వెప్పుడు పిలిచినా , నేనప్పుడొస్తా, నదిసరే;
కనీసం అక్కడైనా ఇక నా మనసు
నెవరూ గాయపరచలేని, ఎవరూ నొప్పించలేని
స్థలమనేదేదైనా మిగిలుందేమో, మరి వెతుకు!

- Sravan (1943-2005) dt: 14-Jun-87

The one, the many

మనసన్నదొకటి
భావాలు కోటి;
ప్రేమన్నదోకటి
రూపాలు కోటి;
లోకాలు చూపే
అందాల కన్ను
కనలేదు నిజము !
కదలాడె జగము!

- Sravan (1943-2005)

The wait

గానమే ప్రాణమై మౌనమే ధ్యానమై
రాధ ఎన్నాళ్లుగా వేచెనో!

ఏ చల్లని గాలి మేనుతాకినా
ఏ పిల్లనగ్రోవి చేవిసోకినా,
గోపకిశోరుని గుసగుసలనుకొని -
మేనుపొంగ తిలకించునో!
ఆతడుకానరాక విలపించునో!!

ఈ కళ్లలో , ఈ గుండెల్లో
ఏనాటికైనా ఆనాటి బాధ
వెలలేని గురుతై నిలిచేనులే!

- Sravan (1943-2005) dt: 25-Jan-87

Self-sympathy

కవిత, సంగీత కళాసరస్వతి
వెదజల్లే తన వెలుగుల్లో
విలసిల్లే తన హోయలల్లో
విరియగా నీలో విశ్రాంతి
కరుగును నవరస మణికాంతి.


- Sravan (1943-2005)

Life

Life is a story in volumes three
The past, the present, and the yet to be -
The first is finished and bid away,
The second we are reading day by day,
The third and the last of the volumes three
Is locked up from sight - God keeps the key.

- Sravan (1943-2005)

Gift

I have so little to give you
Nothing of silver and gold
But I have something to give you
That can't be bought or sold -
My friendship if you find it sweet,
My smile of greeting when we meet,
My tears to comfort you in pain,
My smile to cheer you up again.
My love today, my love tomorrow,
That which from nowhere I do borrow.

- Sravan (1943-2005)

Saturday, December 5, 2009

ప్రకృతి!

నాలో దాగున్న దైవమే నా నేస్తం
ఆ నేస్తానికి ఇదొక అభయహస్తం!
తనను తాక శక్తిలేని పుడమి తో కలవాలని
తనకుతానై ఒరిగే అంబరాన్ని అడుగు:
"ప్రేమం"టే ఏమిటో తెలుస్తుందేమో - వేచి చూడు!

చేతులు యెగాజాపి చేపట్టిన మ్రాను నడుగు
చిఱు కొమ్మ తన పళ్ళని నేలకేందుకు రాలుస్తుందో
"విశ్వాసం" అని అంటుందా? ఏమో విని చూడు!

చివరి ఊపిరి ఆగాక కూడా తనవాళ్ళని తనకోసం
వదిలి పోయిన చంద్రుడ్నడుగు, సూర్యుడు తనకేమిచ్చాడని;
"బాధ్యత" అనే సమాధానమిస్తుందా? చవి చూడు!

ఎండిపోయిన సెలయేటిలో ధారలుకురిపించే,
ఆకాశాన పయనించే మేఘాన్నడుగు అలా చేస్తుందెందుకని -
"సంస్కార"మంటుందేమో, ఒక్క సారి ఆగి చూడు!

అడవిలో ఉన్నా అరవక మానదు కోకిల తన ముక్త కంఠంతో,
ఎవరూ చూడడంలేదని మానదు విరిసి మురిపించే మల్లిక ;
ఎవరో చూడాలని నాట్యం చెయ్యదు పింఛం విప్పే నెమలి,
ఇతరుల కోసం గుబాళించదు కనువిప్పిన గులాబి.
ఎన్నో ఎన్నెన్నో ప్రకృతి మాత తనదిగా ఉంటాయి,
మనసులోని దైవాన్ని వెలికి తీస్తే రహస్యాలు తెలుస్తాయి.

"అహంబ్రహ్మాస్మి" అనేదానికర్ధం తెలియని
స్వార్ధం సొమ్ము చేసుకొనే "వేదాంతులు"; వింతలు
చూపించే మెట్టవేదాంతులు నిండిన ఈ కలికాలంలో
ఆకలిదే పెద్దపీటవేసుకున్న 'సన్నాసులు'గా, దైవం
తన సృష్హ్టిలోని దేనికన్నా అతీతంగా మనుసునిచ్చిన
మానవుడు అలా మారితే పాపం దైవమే నిట్టూర్చాడు
సగటు మనిషివి నువ్వెంతరా నేస్తం!
చప్పుడులేకుండా ఆ దైవానికి అంకితం అయిపో !
ఒక అంబరంలా, ఒక కొమ్మలా , ఒక చంద్రుడిలా , ఒక పువ్వులా!

- Sravan(1943-2005) dt:01.01.2004